• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  మూవీ రివ్యూ : ఖైదీ నెం 150

  khaiid-no-150-review and rating

  మూవీ రివ్యూ&రేటింగ్: ఖైదీ నెం 150

  ప్రధాన తారాగణం : చిరంజీవి,కాజల్,తరుణ్ అరోరా,బ్రహ్మానందం,అలీ,పోసాని కృష్ణ మురళీ,జయ ప్రకాష్ రెడ్డి,రఘు బాబు, పృధ్వీ తదితరులు

  అతిధి పాత్రల్లో : రామ్ చరణ్,నాగబాబు,వి వి వినాయక్
   
  సంగీతం : దేవి శ్రీ ప్రసాద్

  ఛాయాగ్రహణం : రత్నవేలు

  ఎడిటింగ్ : గౌతమ్ రాజు

  నిర్మాత : రామ్ చరణ్

  సమర్పణ : కొణిదల సురేఖ

  నిర్మాణ సంస్థ : కొణిదల ప్రొడక్షన్ బ్యానర్

  కథ: ఏ.ఆర్. మురగదాస్

  మాటలు : పరుచూరి బ్రదర్స్,సత్యానంద్,బుర్ర సాయి మాధవ్,వేమారెడ్డి  

  స్క్రీన్ ప్లే-దర్శకత్వం : వి వి వినాయక్

  మెగాస్టార్ చిరంజీవి దాదాపు దశాబ్దం తరవాత రీఎంట్రీ ఇస్తున్న సినిమా “ఖైదీ నెం 150” ఈ సినిమా ఎప్పుడయితే అనౌన్సమెంట్ చేసారో, అప్పటి నుండి ఆయన అభిమానులే కాకుండా సినీ పరిశ్రమ కూడా మెగాస్టార్ ని వెండి తెరపై చూడాలనే కుతూహలంతో వుంది. ఆ రోజు రానే వచ్చింది రెండు తెలుగు రాష్ర్టాలు మెగాస్టార్ మేనియాతో ఊగిపోతున్న సమయంలో ఎన్నో అంచనాలు, మరోన్నో ఆశలు నడుమ “ఖైదీ నెం 150” ఈ రోజే (11) ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి మెగా అభిమానులు మెగాస్టార్ ని ఏ విధంగా చూడాలి అనుకున్నారో,ఆయన దగ్గర నుండి ఏమేమి ఆశిస్తున్నారో,,, మెగా రీఎంట్రీ ఏ విధంగా సక్సెస్ అయ్యిందో చూద్దాం.

  మూలకథ: శ్రీను (చిరంజీవి) చిల్లరి దొంగతనాలు చేస్తూ జైలు జీవితం గడుపుతూ ఉంటాడు,ఒక సారి జైలు నుండి పారిపోయిన ఖైదీ ని పట్టించే క్రమంలో శ్రీను జైలు నుండి తప్పుంచుకొని పారిపోతాడు.అయితే అనుకోని పరిస్థితిలో తనలాంటి పోలికలు కలిగిన శంకర్ (రెండో చిరంజీవి) ని చూస్తాడు, అతని స్థానంలోకి వెళ్ళితే తన సమస్యలు తీరిపోతాయని,అలాగే డబ్బు సంపాదించుకోవచ్చని శంకర్ ప్లేస్ లోకి వెళ్ళిపోతాడు.అయితే అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది,శంకర్ సామాన్యమైన వ్యక్తి కాడని, అతన్ని నమ్ముకొని ఒక వూరు,వేలాది మంది ప్రజలు వున్నారని,ఒక సమస్య మీద బడా కార్పొరేట్ కంపెనీతో న్యాయ పోరాటం చేస్తున్నాడని తెలుసుకుంటాడు. అసలు ఇంతకీ శంకర్ ఎవరు..? అతనికి అంత మంది ప్రజలకి వున్నా సంబంధం ఏంటి..? శంకర్ ప్లేస్ లో వచ్చిన శ్రీను ఆ పోరాటం కొనసాగించాడా..లేదా..? అనేది మిగిలిన కథ

  విశ్లేషణ : తమిళంలో ఘన విజయం సాధించిన “కత్తి” కి రీమేక్ గా తెరకెక్కించిన సినిమా “ఖైదీ నెం 150′, మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమా అందులోనూ 150 లాంటి మైలురాయి చిత్రం కావటంతో ఈ సినిమాని సొంత కథతో కాకుండా ఇలా అరువు తెచ్చుకున్న కథతో చేయటం ఏంటి అనేవాళ్ళు లేకపోలేదు, అయితే ఈ సినిమా చుసిన వాళ్ళు మెగాస్టార్ ఇమేజ్ కి, అందులోనూ 150 వ సినిమాకి ఈ కథ మాత్రమే సరిపోతుందని ఒప్పుకునేంతలా ఈ సినిమా ఆకట్టుకుంటుంది.

  చిరు ఎంట్రీ సన్నివేశం మెగా అభిమానులకు కొత్తగా ఉంటుంది, ఆ సీన్స్ లో ఖైదీ ని పట్టుకోవటం కోసం చిరంజీవి వేసే ఎత్తుగడ బాగా ఆకట్టుకుంటుంది. అక్కడి నుండి శ్రీను (చిరంజీవి) పారిపోవటం, ఆ తరవాత పాట, వెంటనే శంకర్ (మరో చిరంజీవి ) పాత్రలోకి శ్రీను మారిపోవటం, అక్కడి వరకు కథ చాలా స్పీడ్ గా సాగిపోతుంది. ఆ తర్వాత కాజల్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వటం జరుగుతుంది,అయితే చిరు-కాజల్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు బాగానే ఉంటాయి కానీ,ఎక్కడో కథని చిన్న డిస్టర్బ్ చేసినట్లు అనిపిస్తుంది.మధ్యలో వచ్చే బ్రహ్మానందం,అలీ కామెడీ సీన్స్ కొంతమేర నవ్విస్తాయి. ఎప్పుడయితే శంకర్ గురించి శ్రీను నిజాలు తెలుసుకుంటాడో అక్కడి నుండి కథ లో ఊపు వస్తుంది. శంకర్ అనుకోని విలన్ శ్రీను ని టార్గెట్ చేయటం వాటికీ హీరో తనదైన శైలిలో బదులివ్వటం బాగుంటుంది. ఇంటర్వెల్ కి ముందు వచ్చే కాయిన్ ఫైట్ అయితే మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి.

  ఇక సెకండాఫ్ కి వచ్చే సరికి మొదటిలో పోసాని, జయ ప్రకాష్ రెడ్డి, అలాగే 30  ఇయర్స్ పృధ్వీ లు చేసే కామెడీ నవ్వు తెప్పిస్తుంది. అలాగే చిరంజీవి రైతులతో కలిసి విలన్ ని ఎదుర్కోవటం చాలా ఆసక్తిగా  చూపించాడు. విలన్ వేసే ప్రతి కదలికను పసికట్టి అందుకు దీటుగా హీరో వేసే ప్రణాళికలు కొత్తగా ఉంటాయి. ఒక సన్నివేశంలో అయితే విలన్ కి తెలియకుండా అతని మెడ మీద ఫింగర్ ప్రింట్ వేయటం లాంటివి,అలాగే ప్రీ క్లైమాక్స్ లో రైతులతో కలిసి వాటర్ సప్లై ని ఆపేయటం కోసం హీరో చేసే ప్రయత్నం సినిమాకే హైలైట్ అవుతుంది. అలాగే క్లైమాక్స్ కి ముందు వచ్చే సన్నివేశాలు కూడా ఊహించని విధంగా ఉండి క్లైమాక్స్ ని రక్తి కట్టిస్తాయి.

  అయితే ఇందులో మైనస్ పాయింట్ ఏమిటంటే విలన్ పాత్ర అనే చెప్పాలి. విలన్ పవర్ ఫుల్ గా ఉంటేనే హీరోయిజం ఎలివేట్ అయ్యేది,కానీ ఇందులో విలన్ పాత్ర మరి సాదాసీదాగా ఉంటుంది. తరుణ్ అరోరా నటన కూడా అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. అలాగే సెకండాఫ్ లో సినిమా మరి కొంచం సాగతీత లాగా అనిపిస్తుంది. అయితే ఓవరాల్ గా సినిమా హిట్టే కానీ, చిరు 150 కి తగ్గ సినిమాలాగా అనిపించదు.

  నటీనటులు : ఈ సినిమాకి అన్ని తానై నడిపించాడు మెగాస్టార్ చిరంజీవి, ఆడియో ఫంక్షన్ లో చెప్పినట్లు ఢిల్లీకి పోయాడు..డాన్స్ లు మర్చిపోయాడు, హస్తినాపురం వెళ్ళాడు…హాస్యం పండించలేడు….అనే సందేహాలు వద్దని చెప్పాడు. అవి కేవలం మాటల్లోనే కాదు చేతల్లో చూపించాడు మెగాస్టార్. ఈ వయస్సులో కూడా ఏ మాత్రం తగ్గని ఎనర్జీతో చిరు డాన్స్ లు చుస్తే మతిపోవలసిందే, కుర్ర హీరోలకి దీటుగా ఆయన డాన్సులు వున్నాయి. అలాగే కామెడీ టైమింగ్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. రైతుల కోసం పోరాటం చేసే యోధుడిగా మెగాస్టార్ నటన ఆకట్టుకుంటుంది. ఎందుకు ఆయననే మెగాస్టార్ అని అంటారో మరో మారు నిరూపించాడు.

  హీరోయిన్ కాజల్ ఈ సినిమాలో తన అందచందాలతో అదరకొట్టింది. అదే విధంగా డాన్సులోను మెగాస్టార్ కి పోటీగా స్టెప్స్ వేసి అలరించింది.మనం పైన చెప్పుకున్నట్లు విలన్ పాత్ర పోషించిన తరుణ్ అరోరా పాత్ర ఏమి అంత గొప్పగా లేదు కాబట్టి, ఆయన నటనకి కూడా అంత ఆస్కారం లేదు. ప్రత్యేక గీతంలో నటించిన లక్ష్మి రాయ్ తన అందచందాలతో ఆ పాటకి తగిన న్యాయం చేసింది. కమెడియన్స్ బ్రహ్మనందం, అలీ, పోసాని, రఘుబాబు,పృధ్వీ తమ పాత్రల మేర నటించారు.

  సాంకేతిక వర్గం : కత్తి సినిమాని చిరంజీవి ఇమేజ్ తగ్గట్లు మార్పులు చేర్పులు చేసి, ఆయన నుండి మెగా అభిమానులు ఏమి ఆశిస్తారో తెలుసుకొని వాటన్నిటిని సమపాళ్లలో ఉండేలా సినిమాని తెరకెక్కించిన దర్శకుడు వి వి వినాయక్ ని మొదట మెచ్చుకోవాలి. అసలే రీమేక్ సినిమాలు అంటే కత్తిమీద సాము లాంటిదే అనే సామెత ఉండనే వుంది. అందులోనూ మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా, అదికాక ఒక మైలురాయి లాంటి 150 వ సినిమా అంటే అంచనాలు ఏ స్థాయిలో వుంటాయో ఊహించుకోండి.అలాంటి అంచనాలని వి.వి వినాయక్ చాలా వరకు అందుకున్నాడనే చెప్పాలి. అలాగే రత్నవేలు అందించిన ఛాయాగ్రహణం చాలా బాగుంది. చిరుని ఎంత అందంగా చూపించాడో అదే విధంగా ప్రతి ఫ్రేమ్ ని కూడా చక్కగా తన కెమెరాలో బంధించాడు. ఇక దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు సూపర్ హిట్ టాక్ ని ఎప్పుడో సొంతం చేసుకున్నాయి. ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటుంది. బుర్ర సాయి మాధవ్ రాసిన సంభాషణలు కూడా మనసుని తాకేలా వున్నాయి. నిర్మాణ విలువలకి ఎలాంటి డోకా లేకుండా నిర్మాత రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మించాడు.

  చివరి మాట : ఈ సినిమా మెగా అభిమానులకి ఒక విందు భోజనం లాంటిదే. చిరు ఇమేజ్ కి తగ్గట్లు,అదే విధంగా అభిమానులని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాని తెరకెక్కించారు. అయితే ఇప్పటికే చాలా మంది కత్తి సినిమాని చూశారు. కథ కూడా తెలుసు కాబట్టి ఈ సినిమా చూసేది కేవలం మెగాస్టార్ కోసమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

  గవ్వ కామెంట్ : బాస్ ఈజ్ బ్యాక్

  రేటింగ్ : 3 / 5

  గమనిక : ఇది కేవలం మా అభిప్రాయం మాత్రమే

  Write by :PBN Chowdary   

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *